ఇది 'సిట్' విచారణ కాదు.. 'పిచ్చి' విచారణ

ఇది 'సిట్' విచారణ కాదు.. 'పిచ్చి' విచారణ

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ విచారణకు పిలవడంపై తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది నిష్పక్షపాతంగా జరుగుతున్న విచారణ కాదని, కేవలం రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ప్రభుత్వం ఇలా చేస్తోందని ధ్వజమెత్తారు. "ఇది సిట్ (SIT) విచారణ కాదు.. ఇదొక పిచ్చి విచారణ" అంటూ కేటీఆర్ అభివర్ణించారు. తమ పార్టీ నాయకులను వేధించడమే లక్ష్యంగా ఈ విచారణ సాగుతోందని ఆరోపించారు. ఒకవేళ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వేధించాలని చూస్తే.. న్యాయం కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.

హామీలు నెరవేర్చలేకనే ఈ డ్రామాలు
అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక చేతులెత్తేసిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రజలు తమ సమస్యలపై నిలదీస్తుంటే, వారి దృష్టిని మళ్లించేందుకే పాత కేసులను తోడుతూ ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. కేవలం ఫోన్ ట్యాపింగ్ అంశమే కాకుండా, సింగరేణి టెండర్లలో జరుగుతున్న అవినీతిపై కేటీఆర్ బాంబు పేల్చారు.  సింగరేణి టెండర్ల కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి అసలు సూత్రధారి అని కేటీఆర్ ఆరోపించారు. ఈ టెండర్ల వ్యవహారంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని.. దీనిపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ఊరుకోమని, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడుతూనే ఉంటామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను వాడుకోవడం తగదని ఆయన హితవు పలికారు.

Read More ఘనంగా వినియోగదారుల చైతన్య సదస్సు