దోపిడీ కేసును ఛేదించిన సిసిఎస్ పోలీసులు 

దోపిడీ కేసును ఛేదించిన సిసిఎస్ పోలీసులు 

  •  నలుగురు నిందితుల అరెస్ట్
  • 18 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి,  3 ఆటోలు స్వాధీనం 

 విశ్వంభర, సూర్యాపేట: కేసు వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో  జిల్లా ఎస్పీ నరసింహ  వెల్లడించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిందితులు కంచుకొమ్ముల సంతోష్, కంచుకొమ్ముల గణేష్, షేక్ నశ్రీన్, కంచుకొమ్ముల సాయికిరణ్ ఒక ముఠాగా ఏర్పడి ఆటోలను దొంగలించి దొంగరించిన ఆటోలో ప్రయాణం చేస్తూ ఒంటరిగా ప్రయాణిస్తున్న వృద్ధ మహిళలను లక్ష్యంగా  చేసుకుని బెదిరించి ఆభరణాలు దొంగలించడం, దొంగలించిన ఆటోలోనే తిరుగుతూ రాత్రివేళ తాళాలు వేసిన ఇండ్లలో దొంగతనం చేయడం వీరి పద్ధతి అని తెలిపారు. సూర్యాపేట కోదాడ ప్రాంతాలకు చెందిన వీరు ముఠాగా ఏర్పడి ఈనెల 6 తేదీన ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలోని కోటి నాయక్ తండ శివారులో ఒక వృద్ధురాలిని ఆటోలో ఎక్కించుకుని కొంత దూరము తీసుకువెళ్లి చంపుతామని బెదిరించి ఆమె నోరు మూసి ఆమె మెడలో ఉన్న వెండి గొలుసు దొంగలించుకొని వెళ్లారు. దీనిపై ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు ఇవ్వగా,  దర్యాప్తులో భాగంగా జిల్లా సిసిఎస్ పోలీసులు ఆత్మకూరు పోలీసులు నేరానికి పాల్పడ్డ వారి కదలికలపై నిఘా పెట్టారు.  ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో ఆత్మకూరు మండల పరిధిలోని ఎనుబాముల గ్రామ స్టేజీ వద్ద సిసిఎస్ ఇన్స్పెక్టర్, ఆత్మకూరు ఎస్సై ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా నలుగురు అనుమానిత వ్యక్తులు ఒక   ఆటోలో నిమ్మికల్ వైపు వెళుతుండగా ఆపి తనిఖీ చేసి అదుపులోకి తీసుకున్నారు. కోదాడ రాజీవ్ నగర్ కు చెందిన కంచుకొమ్ముల సంతోష్ ఏ1, కంచుకొమ్ముల గణేష్ ఏ2, కంచుకొమ్ముల సాయికిరణ్ ఏ4, సూర్యాపేటకు చెందిన షేక్ నశ్రీన్ ఏ3 ఉగా గుర్తించడం జరిగింది. వీరిని విచారించగా గతములో మునగాల, సూర్యాపేట టౌన్, కోదాడ టౌన్, తిప్పర్తి, పిడుగురాళ్ల, మేళ్లచెరువు, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట  పోలీస్ స్టేషన్ ల పరిధిలో బంగారము ఆభరణములు, వెండి అభరణములు, వెండి వస్తువులు, ఆటోలు, మోటార్ సైకిల్, సెల్ ఫోన్లు  దొంగతనము చేసినట్టు అంగీకరించారు.  వారిని అదుపులోకి తీసుకొని వారి నుండి  3 లక్షల విలువైన 18 గ్రాముల బంగారం, 5 లక్షల విలువైన 1.5 కేజీల వెండి,  3 ఆటొలు,  ట్యాబ్, ల్యాప్ టాప్, 1 బైకు, 1 టీవి, 2 సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్సైలు శ్రీకాంత్, హరికృష్ణ, ఆ ర్ఎస్ఐ రాజశేఖర్, సిసిఎస్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: