తల్లిదండ్రులను వేధిస్తున్న కొడుకులు
- పోలీసులకు వృద్ధుల ఫిర్యాదు
- కేసు నమోదు చేసిన చిన్నకోడూరు పోలీసులు
విశ్వంభర, సిద్దిపేట: ఆస్తి రాసిచ్చిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోకుండా, కనీసం తిండి పెట్టకుండా వేధిస్తున్న ఇద్దరు కొడుకులపై చిన్నకోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. గంగాపూర్ గ్రామానికి చెందిన కొండి నారాయణరెడ్డి (94)కి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు రాజిరెడ్డి సిద్దిపేటలో వ్యాపారం చేస్తుండగా, చిన్న కుమారుడు పరమేశ్వర్ రెడ్డి గంగాపూర్‌లోనే వ్యవసాయం చేస్తున్నాడు. నారాయణరెడ్డి తనకున్న 7ఎకరాల భూమిని ఇద్దరు కొడుకులకు సమానంగా రిజిస్ట్రేషన్ చేశాడు. వయసు పైబడటంతో తమను చూసుకుంటారని ఆస్తిని అప్పగించగా కొడుకులు మాటమార్చారు. తల్లిదండ్రులను ఓ పాత ఇంట్లో ఉంచి, కనీస సౌకర్యాలు కల్పించకుండా తిండి కూడా సరిగ్గా పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రశ్నిస్తే బూతులు తిడుతూ చంపుతామని బెదిరిస్తున్నారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, చిన్నకోడూరు ఎస్ఐ చంద్రమోహన్ మానవత్వంతో స్పందించారు. బాధితుడు పోలీస్‌స్టేషన్‌కు రాలేని స్థితిలో ఉండటంతో పోలీసులే నేరుగా నారాయణరెడ్డి నివాసానికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించారు. నిస్సహాయ వృద్ధ తల్లిదండ్రులను వేధించడం చట్టరీత్యా నేరమని, బాధ్యులైన కొడుకులపై కేసు నమోదు చేసి, చట్టరీత్య చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీను తెలిపారు.



