ఇంద్రేశంలో వాచ్‌మెన్ దంపతుల దారుణ హత్య

ఇంద్రేశంలో వాచ్‌మెన్ దంపతుల దారుణ హత్య

విశ్వంభర, సంగారెడ్డి : పటాన్‌చెరు మండలం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న దంపతులు అర్థరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో దారుణంగా హత్యకు గురైన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇటీవల వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంద్రేశం ప్రాంతంలో దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ జంట హత్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం మృతులు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దొంగచింత తాండకు చెందిన ధరావత్ సోముల (45), ఆయన భార్య ధరావత్ మంగమ్మ (40)గా గుర్తించారు. జీవనోపాధి కోసం వారు కొన్నేళ్ల క్రితం ఇంద్రేశం ప్రాంతానికి వలస వచ్చారు. సోముల గత మూడున్నర సంవత్సరాలుగా స్థానిక బిల్డర్ వెంకటేశ్వర రెడ్డి వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు ఇప్పటికే వివాహం కాగా, చిన్న కుమార్తె సానియా హాస్టల్‌లో ఉండి చదువుకుంటోంది. ఈ రోజు ఆమె పదవ తరగతి పరీక్ష రాస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో తల్లిదండ్రులు దారుణంగా హత్యకు గురవడం కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.ఇటీవల మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన ఇంద్రేశం ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, దొంగతనాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాచ్‌మెన్ దంపతుల హత్య మరింత కలకలం రేపింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు.

Tags: