నీటిని పొదుపుగా వాడుకోవాలి
విశ్వంభర, రామన్నపేట: వేసవి దృష్ట్యా మంచినీటిని వృథా చేయకుండా, సాగు, తాగు నీటిని ప్రతి ఒక్కరూ పొదుపుగా వాడుకోవాలని నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఈ బొడ్డు సురేందర్ రావు సూచించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, వానకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడం మూలంగా భూగర్భ జలాలు పెరిగాయని,ఆ నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తాగు సాగునీటిని పొదుపుగా వాడుకోని పక్షంలో భూగర్భ జలం పెరిగిన స్థాయిలోనే అడుగంటే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాలలో భూగర్భ జలాలు అడుగంటుతున్నట్లు వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నాయని అన్నారు. నల్లాల ద్వారా వచ్చే నీటిని వృధా చేయరాదని సూచించారు. రైతులు అదే పనిగా మోటర్ ఆన్ చేసి నీటిని వృధా చేయరాదని, పంటలకు సరిపోయిన తర్వాత మోటార్ విధిగా బంద్ చేయాలని ఆయన సూచించారు.



