అత్యాధునిక టెక్నాలజీతో ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీ
- ఆయిల్‌ఫామ్ పంటలతో రైతులకు స్థిరమైన ఆదాయం
- రైతులు ధైర్యంగా ముందుకొచ్చి పంటలు పండించాలి
- ప్రతీ జిల్లాలో ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభించే యోచన
- మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్
- కలెక్టర్ హైమావతితో కలిసి ప్రారంభ ఏర్పాట్లు పరిశీలన
విశ్వంభర, సిద్దిపేట: దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీతో నర్మెటలో నిర్మించిన ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీని ఈనెల 22వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అదే రోజు రూ.40కోట్ల రూపాయలతో ఆయిల్ రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తారని చెప్పారు. నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ.300కోట్ల రూపాయలతో నిర్మించిన ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయిల్‌ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ కె.హైమావతి, ఆయిల్‌ఫెడ్ ఎండీ యాష్మిన్ భాషా, సీపీ రష్మీ పెరుమాళ్‌తో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ, ఇప్పటివరకు రాష్ట్రంలో ఆయిల్ పంప్ ఫ్యాక్టరీలో క్రూడ్ ఆయిల్ మాత్రమే తీస్తున్నామన్నారు. చీడ, పీడ బాధలు, అడవి పందులు, కోతులు, వడగండ్ల వానల బాధలు లేని రైతుకు స్థిరమైన అధిక ఆదాయాన్ని సమకూర్చే ఆయిల్‌ఫామ్ తోటల పెంపకానికి రైతులు ముందుకు రావాలన్నారు. రైతులు ధైర్యంగా ముందుకొచ్చి ఆయిల్‌ఫామ్ పంటలు పండించాలని చెప్పారు. వ్యవసాయశాఖ మంత్రిగా మొదటి సంతకం నర్మెట్ట ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి చేశానని అప్పుడు రూ.12వేలు ఉన్న ధర ఇప్పుడు రూ.21వేలకు చేరిందని తెలిపారు. రూ.25వేలు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వాతావరణం ఆయిల్‌ఫామ్ పంటలు పండటానికి అనుకూలమైందని, రాష్ట్రంలో 20లక్షల ఎకరాలు, దేశవ్యాప్తంగా 70లక్షల ఎకరాల్లో పంటలు పండించడానికి అనుకూలమన్నారు. ఈనెల 20, 21, 22 తేదీలలో ఫ్యాక్టరీ ఆవరణలో రైతు మేళా నిర్వహించి, వ్యవసాయ పనిముట్లను ప్రదర్శించి శాస్త్రవేత్తలు, అధికారులు, అనుభవం గల ఆయిల్‌ఫామ్ రైతులతో అవగాహన కల్పిస్తామని చెప్పారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గుజరాత్‌లో పాల సేకరణ గ్రామీణ స్థాయి నుంచి జరుగుతుందని, అక్కడి అమూల్ పాలు దేశ వ్యాప్తంగా వ్యాపించిందన్నారు. ఇక్కడ ప్రతీ జిల్లాకు ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించాలని మంత్రి తుమ్మల భావిస్తున్నారన్నారు. ఆయిల్‌ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేందుకు ప్రత్యేక చొరవ చూపారన్నారు. రైతులు సంతోషంగా ఉండాలంటే ఆయిల్‌ఫామ్ పంటలను వేసుకోవాలని సూచించారు. కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ సాధారణంగా వరిని పండించడం రైతులకు అలవాటైందని, పంట మార్పిడి చేసుకోకపోతే భవిష్యత్‌లో ఇబ్బంది పడతారని చెప్పారు. లాభాదాయకంగా వ్యవసాయం సాగించాలంటే తప్పనిసరిగా ఆయిల్‌ఫామ్ సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీవో సదానందం, జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణి, ఆయిల్‌ఫెడ్ అధికారులు సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



