కాంగ్రెస్ విజయానికి బీఆర్ఎస్ వైఫల్యమే కారణం
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు రావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ పూర్తి వైఫల్యమే కారణమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు రావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ పూర్తి వైఫల్యమే కారణమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఈ ఫలితాలు బీఆర్ఎస్, బీజేపీ పొత్తుకు తొలి మెట్టుగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. గతంలో తోక పార్టీలుగా భావించిన సీపీఎం, సీపీఐలను ఇప్పుడు బీఆర్ఎస్ ఆశ్రయిస్తోందని విమర్శించారు. నిజామాబాద్‌తో సహా పలు చోట్ల బీఆర్ఎస్ కేడర్ పూర్తిగా నిర్వీర్యమైందని, కేటీఆర్ కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేదని విమర్శించారు.
కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరాటం శూన్యం
ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందని కవిత ఆరోపించారు. అయినా బీఆర్ఎస్ పార్టీ అనేక చోట్ల మూడో, నాలుగో స్థానానికి పరిమితమైందని ఎద్దేవా చేశారు. కూనంనేని సాంబశివరావు కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌పై ఏం మాట్లాడారో కేటీఆర్ గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ ఎక్కడ పోరాటం చేస్తోందో చెప్పాలని నిలదీశారు. కరీంనగర్‌లో మినహాయిస్తే బీజేపీ ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తొందరపడి కారు కూతలు కూయకుండా, తప్పులు సరిదిద్దుకొని ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
ప్రలోభాలకు గురిచేశారు.. జాగృతి విజయంపై కవిత
ఈ ఎన్నికల్లో ప్రజలు 40కి పైగా స్థానాల్లో జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులను గెలిపించారని కవిత వెల్లడించారు. వడ్డేపల్లిలో తమకు పూర్తి ఆధిక్యం వచ్చినప్పటికీ, అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసిందని ఆరోపించారు. 16 మున్సిపాలిటీలు రావడమే ఎక్కువ అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. ప్రజలు తమను ఆదరిస్తున్నారన్న విశ్వాసం కలుగుతోందని తెలిపారు.
సింగరేణిలో జాగృతి, హెచ్ఎంఎస్ పొత్తు
రేవంత్ రెడ్డి తానే రాజు - తానే మంత్రి అన్నట్లు కాకుండా, హామీల అమలుపై దృష్టి పెట్టాలని కవిత కోరారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, పిక్చర్ ఇంకా ముందుందని హెచ్చరించారు. భవిష్యత్తులో సింగరేణి ఎన్నికల్లో జాగృతి, హెచ్ఎంఎస్ కలిసి పోటీ చేసి సత్తా చాటుతామని ప్రకటించారు. సింగరేణి కుంభకోణంపై సీపీఐ, ఏఐటీయూసీ కనీసం నోరు కూడా విప్పలేదని కవిత ఆరోపించారు.



