ప్రజా పాలనకు దక్కిన గౌరవం

ప్రజా పాలనకు దక్కిన గౌరవం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన భారీ విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన భారీ విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫలితాలు ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన విశ్వాసాన్ని చాటిచెప్పాయని ఆయన పేర్కొన్నారు. ఈ అఖండ విజయాన్ని పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం అంకితం చేశారు. ''భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం. కార్యకర్తల శ్రమ, పార్టీ పట్ల వారికున్న అనంతమైన అభిమానమే నేడు కాంగ్రెస్ ప్రభంజనానికి కారణం." అని రేవంత్ రెడ్డి కొనియాడారు.

అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజా ఆమోదం
రాష్ట్రంలో గత రెండేళ్లుగా సాగుతున్న ‘ప్రజా పాలన’కు ఈ తీర్పు ఒక సాక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణకు ప్రజలు ఈ ఓటు ద్వారా తమ సంపూర్ణ ఆమోదాన్ని తెలిపారని వివరించారు. ఈ తీర్పు ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు.

Read More నకిరేకల్ ఎమ్మెల్యే తో రాపోలు భేటీ.  చేనేత సమస్యలపై చర్చ. 

ఈ విజయోత్సాహంతో ఆగిపోకుండా, భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. నగరాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని చెప్పారు. పేదల సంక్షేమమే పరమావధిగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని, ఈ మద్దతును స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.