పోలీస్ వేషం చూసి మోసపోకు.. ప్రజలను హెచ్చరించిన సీపీ సజ్జనార్
సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో అమాయకులను మోసం చేస్తున్నారని, ముఖ్యంగా 'డిజిటల్ అరెస్ట్' పేరుతో సాగుతున్న నయా మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో అమాయకులను మోసం చేస్తున్నారని, ముఖ్యంగా 'డిజిటల్ అరెస్ట్' పేరుతో సాగుతున్న నయా మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. శనివారం ఆయన తన 'ఎక్స్' ఖాతా ద్వారా ఒక వీడియోను షేర్ చేస్తూ, పోలీస్ వేషధారణలో వచ్చే వీడియో కాల్స్ నమ్మవద్దని సూచించారు.
పోలీస్ వేషంలో పక్కా మోసం
నేరగాళ్లు పోలీస్ స్టేషన్ తరహా సెటప్ ఏర్పాటు చేసుకుని, పోలీసు యూనిఫాం ధరించి వీడియో కాల్స్ చేస్తున్నారని సీపీ తెలిపారు. అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, డబ్బులు దండుకుంటున్నారని ఆయన వివరించారు. ‘పోలీస్ వేషం చూసి మోసపోకు.. వీడియో కాల్ నమ్మి మునిగిపోకు’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. పోలీసులు ఎప్పుడూ వాట్సాప్ లేదా స్కైప్ వంటి వీడియో కాల్స్ ద్వారా నిందితులను విచారించరని సీపీ సజ్జనార్ తెలిపారు. విచారణ పేరుతో పోలీసులు ఎవరినీ డబ్బులు డిమాండ్ చేయరని పేర్కొన్నారు. భారత చట్టాల్లో 'డిజిటల్ అరెస్ట్' అనే పదమే లేదు. దీనికి చట్టబద్ధత లేదని చెప్పారు.
అప్రమత్తతే రక్ష
నగర పోలీసులు చేపట్టిన 'జాగృత్ హైదరాబాద్ - సురక్షిత్ హైదరాబాద్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీపీ కోరారు. ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే ఆందోళన చెందవద్దని, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులు, మిత్రులకు షేర్ చేసి వారికి కూడా అవగాహన కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.



