కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష: కేటీఆర్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ భవిష్యత్ కార్యచరణపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టత ఇచ్చారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ భవిష్యత్ కార్యచరణపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. అధికార పార్టీ అడ్డదారులు తొక్కినా, క్షేత్రస్థాయిలో గులాబీ జెండా ధైర్యంగా నిలబడిందని ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 30 శాతానికి పైగా వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం సామాన్యమైన విషయం కాదని, ఇది తమ పార్టీపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. కేవలం 15 మున్సిపాలిటీల్లోనే కాకుండా, మరో 37 చోట్ల హంగ్ ఏర్పడేలా ఫలితాలు రావడం వెనుక తమ కార్యకర్తల వీరోచిత పోరాటం ఉందని కేటీఆర్ కొనియాడారు.
అధికార దుర్వినియోగంపై ధ్వజం
ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ తీరును కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. గద్వాల, వర్ధన్నపేట వంటి చోట్ల జరిగిన రీ-కౌంటింగ్ గందరగోళాన్ని ప్రస్తావిస్తూ.. అధికారులను అడ్డం పెట్టుకుని, డబ్బు, మద్యం పంపిణీ చేసి అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని, కానీ ఇక్కడ కాంగ్రెస్ 80-90 శాతం స్థానాలు గెలుచుకోలేకపోవడమే ఆ పార్టీ వైఫల్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, దమ్ముంటే ఉప ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ సవాల్ విసిరారు.
ఎర్రజెండాతో దోస్తీ.. కొత్త సమీకరణాలు
ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్ ఫలితాల నేపథ్యంలో కేటీఆర్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీల కుమ్మక్కు రాజకీయాలను తిప్పికొట్టేందుకు సీపీఐతో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. సింగరేణి ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలను అడ్డుకోవాలంటే వామపక్షాలు, బీఆర్ఎస్ కలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సీపీఐ నేత కూనంనేని సాంబశివరావుతో మాట్లాడి, కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఎర్రజెండాకు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కేతన్‌పల్లి మున్సిపాలిటీలో ఇదే తరహాలో కలిసి పనిచేసి విజయం సాధించామని ఆయన గుర్తు చేశారు.
బీఆర్ఎస్ పని అయిపోయిందన్న విమర్శకులకు ఈ ఫలితాలే సమాధానమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా తాము ప్రజల గొంతుకగా మారడంలో సఫలమయ్యామని, భవిష్యత్తులో మరిన్ని మెరుగైన ఫలితాల కోసం పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. పార్టీకి కలిసొచ్చే తటస్థులను, ప్రజాస్వామిక శక్తులను కలుపుకొని పోతామని.. రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ప్రజలు భావిస్తున్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ జనంలోనే ఉంటామని స్పష్టం చేశారు. అక్రమ కేసులకు భయపడకుండా పోరాడిన కార్యకర్తలకు అండగా ఉంటామని, త్వరలోనే కొత్త కార్యాచరణ రూపొందిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.



