లాయర్ స్వప్న హత్య కేసులో మరో ట్విస్ట్
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో లాయర్ స్వప్న(34) దారుణ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో లాయర్ స్వప్న(34) దారుణ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి వివాదాల నేపథ్యంలో తన సొంత చెల్లెలిని చంపేందుకు అన్న రాజు పన్నిన ప్లాన్ ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు రాజుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్వప్న కదలికలను ఎప్పటికప్పుడు రాజుకు చేరవేసిన శేఖర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
గతంలోనూ రెండుసార్లు హత్యాయత్నం
విచారణలో షాకింగ్ నిజాలు ఒప్పుకున్న రాజు, హత్యకు ముందు స్వప్నను చంపేందుకు రెండుసార్లు ప్రయత్నించినట్లు తెలిపాడు. మొదటిసారి కారుతో స్వప్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. రెండోసారి బుల్డోజర్‌తో స్వప్నను ఢీకొట్టించి, ఆ ప్రమాదంలో ఆమె మరణిస్తే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని భావించాడు. అయితే, స్వప్న అదృష్టవశాత్తూ ఆ రెండు ప్రమాదాల నుండి ప్రాణాలతో బయటపడింది.
సీసీ కెమెరాలు లేని ప్రదేశాల కోసమే వేట
సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను ముందే గుర్తించిన రాజు, ఆ ప్రదేశాల్లో స్వప్నను వాహనాలతో వెనుక నుండి ఢీకొట్టాలని ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్ సక్సెస్ చేయడం కోసం తన స్నేహితులు వీరేష్, శివ, శేఖర్ సహాయం తీసుకున్నాడు. గతంలో నమోదైన ఈ రోడ్డు ప్రమాద కేసులను ఇప్పుడు పోలీసులు హత్యాయత్నం కేసులుగా మార్చనున్నట్లు వెల్లడించారు.



