ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీబిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు

ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీబిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'గాంధీ సరోవర్' ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టు విశేషాలను ముఖ్యమంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు వివరించారు. ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని తెలిపారు. 1948 ఫిబ్రవరిలో మహాత్మాగాంధీ చితాభస్మాన్ని సరిగ్గా ఆ ప్రాంతంలోనే నిమజ్జనం చేశారని, ఆ చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేస్తూ, ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా, పవిత్రంగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

కొత్త విమానాశ్రయాలపై దృష్టి
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ తర్వాత, ముఖ్యమంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో విమానయాన రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన అనుమతులు, నిధుల కోసం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం విజ్ఞప్తి చేశారు. మామూనూరు విమానాశ్రయం భూసేకరణ ప్రక్రియ పూర్తయినందున, నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కోరారు. కొత్తగూడెం విమానాశ్రయం పాల్వంచలో స్థలం గుర్తించినందున, ఓఎల్ఎస్ సర్వే మరియు ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్గాం విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి అదనంగా 249.82 ఎకరాల భూమి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రికి తెలియజేశారు.

Read More దండు రాహుల్ గుప్త కు అభినందనలు - పూర్ణ చందర్ గుప్త 

రైల్వే ప్రాజెక్టులపై చర్చ
అనంతరం కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని ఆయనను కోరారు. కేంద్ర మంత్రులతో భేటీ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూ 'తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్'ను ముఖ్యమంత్రి వారికి అందజేశారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ డాక్యుమెంట్ ద్వారా తెలంగాణను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.