మాజీ ఆర్మీ చీఫ్ నరవణే పుస్తకం చుట్టూ రాజకీయ దుమారం.. కేంద్రం సంచలన నిర్ణయం?
భారత సైన్యానికి నాయకత్వం వహించిన మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రచించిన ఆత్మకథ 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ'ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: భారత సైన్యానికి నాయకత్వం వహించిన మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రచించిన ఆత్మకథ 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ'ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంకా అధికారికంగా విడుదల కాకముందే ఈ పుస్తకంలోని అంశాలు బయటకు రావడం, దానిపై పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరగడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా గల్వాన్ ఘర్షణలు, అగ్నివీర్ పథకం వంటి సున్నితమైన అంశాల గురించి ఇందులో ప్రస్తావించినట్లు సమాచారం.
20 ఏళ్ల 'కూలింగ్ ఆఫ్ పీరియడ్' నిబంధన?
ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మిలిటరీ సహా ఇతర కీలక ఉన్నత పదవుల్లో పనిచేసి రిటైర్ అయిన అధికారులు, వారు బాధ్యతల నుంచి తప్పుకున్న 20 ఏళ్ల వరకు పుస్తకాలు ప్రచురించకూడదనే 'కూలింగ్ ఆఫ్ పీరియడ్'ను తప్పనిసరి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై అనధికారికంగా చర్చ జరిగినట్లు సమాచారం. దేశ భద్రత, రహస్య సమాచార రక్షణ దృష్ట్యా ఈ నిబంధన అవసరమని పలువురు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, కీలక అధికారులు రాసే పుస్తకాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి. నరవణే పుస్తకానికి రక్షణ శాఖ ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. ఈ లోపే పుస్తక ప్రతులు బయటకు రావడంపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎప్ స్టిన్ ఫైల్స్ వివాదంపై ప్రభుత్వం స్పందన
ఇదే సమావేశంలో ఇటీవల అమెరికాలో బయటపడిన జెఫ్రీ ఎప్ స్టిన్ ఫైల్స్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు ఈ ఫైల్స్‌లో ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను మంత్రి ఇప్పటికే ఖండించారు. ప్రతిపక్షాల విమర్శలపై అతిగా స్పందించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా కొనసాగించాలని మంత్రులు ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.



