రాజకీయ విరాళాల్లో బీజేపీ రికార్డు సృష్టి

రాజకీయ విరాళాల్లో బీజేపీ రికార్డు సృష్టి

దేశీయ రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 

విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశీయ రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్  తాజాగా విడుదల చేసిన 2024–25 ఆర్థిక సంవత్సర నివేదిక ప్రకారం.. రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ ట్రస్ట్‌ల ద్వారా అందిన విరాళాల్లో సింహభాగం బీజేపీకే దక్కాయి. దేశవ్యాప్తంగా వివిధ సంస్థల నుంచి ఎలక్టోరల్ ట్రస్ట్‌లకు రూ.3,826 కోట్ల విరాళాలు అందాయి. ఈ మొత్తం నిధుల్లో, బీజేపీకి రూ.3,157 కోట్లు (సుమారు 82.5%) దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి కేవలం రూ.298.78 కోట్లు (7.8%) మాత్రమే దక్కాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.102 కోట్లు అందాయి.

ప్రధాన దాతలు - కార్పొరేట్ దిగ్గజాల వాటా
రాజకీయ విరాళాల్లో కార్పొరేట్ సంస్థల వాటా అత్యధికంగా ఉంది. ఎలివేటెడ్ అవెన్యూ రియల్టీ రూ.500 కోట్లు అందజేసి అగ్రస్థానంలో నిలిచింది. టాటా గ్రూప్ (టాటా సన్స్ & TCS) సుమారు రూ.525 కోట్ల నిధులను సమకూర్చింది. మేఘా ఇంజనీరింగ్ తెలుగు రాష్ట్రాల నుండి రూ.175 కోట్లను విరాళంగా ఇచ్చి ప్రముఖ దాతల జాబితాలో నిలిచింది. ఈ భారీ నిధుల సమీకరణ బీజేపీకి పార్టీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు, ఎన్నికల వ్యయానికి భారీ ఆర్థిక వెన్నుదన్నుగా నిలిచింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నిధుల సమీకరణలో కనిపిస్తున్న ఈ భారీ వ్యత్యాసం, భవిష్యత్తులో ఎన్నికల ప్రచారాలు, పోటీ తత్వాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More  Himachal Pradesh bus accident: ఘోర బస్సు ప్రమాదం... 12 మంది మృతి..!!