కొత్తగూడెం మేయర్ పీఠం సీపీఐదే!

కొత్తగూడెం మేయర్ పీఠం సీపీఐదే!

 కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఊహించని సంచలనం సృష్టించాయి. అగ్రవర్ణ పార్టీల హవా కొనసాగుతున్న తరుణంలో, సీపీఐ పార్టీ ఎవరూ ఊహించని విధంగా అత్యధిక వార్డులను కైవసం చేసుకుని తిరుగులేని శక్తిగా అవతరించింది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఊహించని సంచలనం సృష్టించాయి. అగ్రవర్ణ పార్టీల హవా కొనసాగుతున్న తరుణంలో, సీపీఐ పార్టీ ఎవరూ ఊహించని విధంగా అత్యధిక వార్డులను కైవసం చేసుకుని తిరుగులేని శక్తిగా అవతరించింది. కొత్తగూడెం కార్పొరేషన్‌లోని మొత్తం డివిజన్లలో సీపీఐ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించడంతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది. స్థానిక ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో పార్టీ సాధించిన ఈ ఘన విజయం సీపీఐ క్యాడర్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

కేటీఆర్ ఫోన్ కాల్, ఇండిపెండెంట్ల సపోర్ట్
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. ఫలితాలపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. కొత్తగూడెం ప్రజలు సీపీఐపై ఉంచిన అపారమైన నమ్మకాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ విజయం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించడమే కాకుండా, పార్టీకి మద్దతు ప్రకటించినట్లు కూనంనేని వెల్లడించారు. దీనితో పాటు, కార్పొరేషన్‌లో గెలిచిన పలువురు ఇండిపెండెంట్లు కూడా సీపీఐ వైపు మొగ్గు చూపుతూ తమ మద్దతును తెలుపుతున్నారని ఆయన తెలిపారు. అయితే, ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి అధికారిక చర్చలు జరపలేదని, జాతీయ స్థాయిలో పార్టీ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగానే మున్సిపల్ పరిపాలనలో ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

Read More  వైదేహినగర్ పార్క్ లో మెగా రక్తదాన శిబిరం 

మేయర్ పదవి గిరిజనుడికే
కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని అధిరోహించే అభ్యర్థి విషయంలో కూనంనేని సాంబశివరావు కీలక ప్రకటన చేశారు. మేయర్ పదవిని గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తులు లేకపోయినా, జాతీయ విధానాల ప్రకారం కేవలం స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ కార్పొరేషన్ పరిపాలన సాగుతుందని ఆయన తెలిపారు. పార్టీ అధికారంలోకి రాకముందే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరం చేసిన కూనంనేని, ఇప్పుడు కార్పొరేషన్ ద్వారా మరింతగా ప్రజా సేవ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.