దేశీ కుక్క పిల్లలను దత్తత తీసుకోండి: మంత్రులు

దేశీ కుక్క పిల్లలను దత్తత తీసుకోండి: మంత్రులు

 దేశీ కుక్క పిల్లలను దత్తత తీసుకునేందుకు నగర ప్రజలు ముందుకు రావాలని మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ రేణుకా చౌదరి విజ్ఞప్తి చేశారు. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: దేశీ కుక్క పిల్లలను దత్తత తీసుకునేందుకు నగర ప్రజలు ముందుకు రావాలని మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ రేణుకా చౌదరి విజ్ఞప్తి చేశారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో శనివారం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఇండీ కుక్కపిల్లల దత్తత మేళా'ను వారు ప్రారంభించారు. "బీ ఏ హీరో.. దత్తత తీసుకోండి, షాపింగ్ వద్దు" అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మంత్రులు అభినందించారు. మేళాలో ప్రదర్శనకు ఉంచిన కుక్కపిల్లలను పరిశీలించిన మంత్రులు, దత్తత తీసుకున్న వారికి పప్పీలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రియాంక అల, జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వకీల్, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పూర్వకాలం నుండి కుక్కలు మనుషులకు నమ్మకమైన మిత్రులుగా ఉంటున్నాయని గుర్తుచేశారు. వీధుల్లో ఉండే కుక్క పిల్లలను ప్రజలు దత్తత తీసుకుని తమ ఇంట్లో చోటు కల్పించాలని కోరారు. దత్తత తీసుకున్న వారు పప్పీలను కుటుంబ సభ్యుల్లా, స్నేహితుల్లా ఆదరించాలని, యజమానులు వాటికి సకాలంలో వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేయించాలని సూచించారు.

Read More అసెంబ్లీలో కేసీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కరచాలనం ...వీడియో ఇదిగో

వాలెంటైన్స్ డే సందర్భంగా నిర్వహించిన ఈ మేళాలో డీ-వార్మింగ్, వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ఆరోగ్యకరమైన 50 దేశీ కుక్కపిల్లలను ప్రదర్శనకు ఉంచారు. ఇందులో 30 కుక్కపిల్లలను సందర్శకులు దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమం మనుషులు, జంతువుల మధ్య ఉన్న ప్రేమ, అనుబంధానికి ప్రతిరూపంగా నిలిచింది.