ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ భేటీ
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయంపై ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయంపై ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని, మేయర్, చైర్‌పర్సన్ స్థానాలను దక్కించుకోవడంలో చూపిన ప్రతిభకు ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
సంక్షేమ పాలనకు ప్రజల ఆమోదం
తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రియాంక గాంధీకి సీఎం రేవంత్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, అదే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కారణమైందని రేవంత్ పేర్కొన్నారు. ఈ విజయం కాంగ్రెస్ శ్రేణులలో నూతన ఉత్తేజాన్ని నింపిందని, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చర్చించారు.
తెలంగాణ భవిష్యత్ కార్యాచరణ
మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో తిరుగులేని ఆదరణ ఉందని తేలిందని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని, పార్టీ సంస్థాగత బలోపేతం మరియు రాష్ట్ర అభివృద్ధిపై భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.



