కరీంనగర్, నిజామాబాద్‌పై బీజేపీ కన్నే!

కరీంనగర్, నిజామాబాద్‌పై బీజేపీ కన్నే!

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన బలాన్ని నిరూపించుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన బలాన్ని నిరూపించుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ సీట్లు, ఓట్లు సాధించామని.. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఎంత బలంగా ఉందో ఈ ఫలితాలే నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను విశ్లేషిస్తే దాదాపు 350 వార్డులు, డివిజన్లలో తమ పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేస్తున్నారని రామచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆరు మున్సిపాలిటీల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.

కార్పొరేషన్లపై పట్టు.. స్వతంత్రుల మద్దతు
ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకోబోతోందని రామచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, నారాయణపేట, రాయికల్ వంటి మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థులే ఛైర్మన్ పీఠాలను అధిరోహిస్తారని తెలిపారు. ఎక్స్‌ అఫిషియో ఓట్లు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో తమ పీఠాలను దక్కించుకుంటామని, ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. అయితే కొన్ని జిల్లాల్లో ఆశించిన మేర ఫలితాలు రాలేదని, త్రిముఖ పోరు వల్ల పార్టీకి కొంత నష్టం వాటిల్లిందని అంగీకరించారు.

Read More కనబడుటలేదు

విపక్షాల ఐక్యతపై విమర్శలు
బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్ పార్టీలు లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నాయని రామచందర్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ పార్టీలన్నీ కలిసి పనిచేయడం వల్లే బీఆర్ఎస్ కొన్ని స్థానాలను గెలవగలిగిందని విమర్శించారు. కాంగ్రెస్‌కు అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదని, అనేక చోట్ల హంగ్ ఏర్పడటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. హంగ్ ఏర్పడిన ఏ మున్సిపాలిటీలోనూ బీజేపీ ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా తమకు మద్దతు ఇవ్వాలనుకుంటే మాత్రం స్వాగతిస్తామని తెలిపారు.

అధికారమే లక్ష్యం
హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ, తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని రామచందర్‌రావు తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Tags: