'సేవా తీర్థ్' నుంచి మోదీ కీలక నిర్ణయాలు

'సేవా తీర్థ్' నుంచి మోదీ కీలక నిర్ణయాలు

భారతదేశ పరిపాలనా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి కార్యాలయం నూతన భవనం 'సేవాతీర్థ్'ను ప్రారంభించారు. 

విశ్వంభర, నేషనల్ బ్యూరో: భారతదేశ పరిపాలనా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి కార్యాలయం నూతన భవనం 'సేవాతీర్థ్'ను ప్రారంభించారు. అత్యంత ఆధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ నూతన కార్యాలయ సముదాయంలోకి ప్రవేశించిన వెంటనే, ప్రధాని మోదీ ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని పలు కీలక పథకాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ఈ రోజు భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో కొత్త అధ్యాయానికి సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు. 'వికసిత్ భారత్' సాధన లక్ష్యంతోనే మనం పనిచేస్తున్నామని, ఈ నూతన భవనం 'కర్తవ్య భవన్' గా పరిపాలనకు దిక్సూచిగా మారుతుందని అభివర్ణించారు. స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా, కొందరు ఇప్పటికీ మానసిక బానిసత్వ ఛాయలను విడిచిపెట్టలేదని విమర్శించారు. మనం నిర్మించుకున్న ఈ నూతన సముదాయం, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్, కేబినెట్ సెక్రటేరియట్‌లతో కలిసి దేశ పరిపాలనకు మరింత వేగాన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


పీఎం-రాహత్ పథకం ప్రారంభం
రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడేందుకు, వారికి సకాలంలో వైద్య సహాయం అందించే లక్ష్యంతో ప్రధాని మోడీ 'పీఎం-రాహత్' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి తక్షణమే నగదు రహిత చికిత్స అందించనున్నారు. ప్రతి ప్రమాద బాధితుడికి రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించి, అత్యవసర వైద్యం అందించడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించడం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. అలాగే మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, 'లక్‍పత్ దీదీ' పథకం లక్ష్యాన్ని భారీగా పెంచారు. ఇప్పటి వరకు ఉన్న 3 కోట్ల మంది మహిళల టార్గెట్‌ను, 2029 నాటికి 6 కోట్ల మందికి విస్తరించేలా ప్రధాని నిర్ణయం తీసుకున్నారు.

Read More Sabarimala Gold Theft Case: శబరిమల ప్రధాన పూజారి అరెస్టు..!!

వ్యవసాయ నిధి రూ.2లక్షల కోట్లకు పెంపు
వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ప్రధాని కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రస్తుతమున్న రూ.1 లక్షల కోట్లకు బదులుగా రూ.2 లక్షల కోట్లకు రెట్టింపు చేస్తూ ప్రధాని ఫైలుపై సంతకం చేశారు. దేశంలో స్టార్టప్ వ్యవస్థను వేగవంతం చేసేందుకు, యువతలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రూ.10 వేల కోట్ల నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.