ఖనిజ రంగంలో సంస్కరణల ఎక్స్‌ప్రెస్
దేశీయ ఖనిజ అన్వేషణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశీయ ఖనిజ అన్వేషణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేశంలోని అన్వేషించని ఖనిజ నిక్షేపాలను వెలికితీసేందుకు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు రెండో విడత అన్వేషణ లైసెన్స్ బ్లాకుల వేలాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీఎస్ఐ, ఎస్‌బీసీఏపీఎస్, ఎంఎస్‌టీసీ, ఎన్ఎంఈటీ వంటి వివిధ విభాగాల ప్రతినిధులు వేలం ప్రక్రియ, ఈ-వేలం పద్ధతులు, మరియు అన్వేషణ ఖర్చులలో రాయితీలు పొందే పథకాలపై వివరణాత్మక ప్రజెంటేషన్లు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఖనిజ రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగం కూడా అన్వేషణ ప్రక్రియలో భారీగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. "కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో చేపడుతున్నవి సాధారణ సంస్కరణలు కావు.. ఇదొక సంస్కరణల ఎక్స్‌ప్రెస్" అని ఆయన వ్యాఖ్యానించారు. గనుల రంగంలో పారదర్శకత, పెట్టుబడులను పెంచడమే లక్ష్యంగా పరివర్తనాత్మక మార్పులు తెస్తున్నట్లు వెల్లడించారు.
ఏఐ, ఎంఎల్ సాంకేతికతతో ‘నెక్స్ట్-జనరేషన్’ పోర్టల్
ఖనిజ అన్వేషణలో డేటా విశ్లేషణను సులభతరం చేసేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన నెక్స్ట్-జనరేషన్ పోర్టల్‌నుమంత్రి ప్రారంభించారు.ఇది ఏఐ, ఎంఎల్ ఆధారిత సాధనాలతో డేటా సేకరణ, విశ్లేషణను ఏకీకృతం చేస్తుంది. నేషనల్ జియోసైన్స్ డేటా రిపోజిటరీతో అనుసంధానమైన ఈ పోర్టల్, అన్వేషణలో పారదర్శకతను, సామర్థ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.
11 ఖనిజ బ్లాకులకు వేలం
గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. మొదటి విడతకు వచ్చిన అద్భుతమైన స్పందనతో ఇప్పుడు రెండో విడతను చేపట్టినట్లు తెలిపారు. ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న 11 కీలక, భూ పొరల లోతుల్లో ఉన్న ఖనిజ బ్లాకులను ఈ విడతలో చేర్చినట్లు తెలిపారు. ఎంఎండీఆర్ సవరణ చట్టం-2023 ద్వారా ప్రవేశపెట్టిన 'అన్వేషణ లైసెన్స్' విధానం వ్యాపార నిర్వహణను సులభతరం చేసిందని, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సమాన అవకాశాలు కల్పిస్తోందని వివరించారు.



