క్యాంపు రాజకీయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం అలర్ట్

క్యాంపు రాజకీయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం అలర్ట్

రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. దాదాపు 40 మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడంతో 'హంగ్' పరిస్థితులు నెలకొన్నాయి. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. దాదాపు 40 మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడంతో 'హంగ్' పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్వతంత్ర అభ్యర్థులకు, చిన్న పార్టీల కౌన్సిలర్లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. విజేతలను సుదూర ప్రాంతాలకు తరలిస్తూ జాగ్రత్త పడుతున్నాయి. ఈ పరిణామాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. క్యాంపు రాజకీయాలను అడ్డుకోవాలని, నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

16న మేయర్ల ఎన్నిక
ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం, ఛైర్‌పర్సన్లు, మేయర్ల ఎన్నికలకు ఎస్‌ఈసీ షెడ్యూల్ ఖరారు చేసింది. ఈనెల 16న ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయాలి. అదే రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్/ఛైర్ పర్సన్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. విజేతలు ఎన్నికల కోడ్‌కు కట్టుబడి ఉంటామని డిక్లరేషన్ ఇవ్వాలని, అలాగే ధ్రువపత్రాలను స్వయంగా వారికే అందజేయాలని అధికారులను ఆదేశించింది.

Read More శ్రీ లక్ష్మీ గోశాలకు  5116 విరాళం

నిఘా బృందాల అప్రమత్తం
క్యాంపు రాజకీయాల నేపథ్యంలో ఎస్‌ఈసీ పలు కఠిన నిబంధనలను విధించింది. బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్ 163 అమలులో ఉంటుంది. ముగ్గురికి మించి గుంపుగా తిరగకూడదు. ముందస్తు అనుమతి లేకుండా ప్రైవేట్, టూరిస్ట్ బస్సుల్లో విజేతలను తరలించడం నిషిద్ధం. కోడ్ ఉల్లంఘించిన పార్టీలు, విజేతలకు వెంటనే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ నివేదికలు పంపాలని ఎస్‌ఈసీ జిల్లా ఎన్నికల అధికారులకు స్పష్టం చేసింది.