నల్గొండలో 'హస్తం' విజయకేతనం

నల్గొండలో 'హస్తం' విజయకేతనం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపితమైంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి, ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపితమైంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి, ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తమ పట్టును చాటుకుంటూ, మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని మున్సిపాలిటీలపై జెండా ఎగురవేసింది. ముఖ్యంగా హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. హాలియాలో మొత్తం 12 వార్డులకు గాను ఏకంగా 11 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. అటు నందికొండలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. అక్కడ కూడా 11 వార్డులను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోగా, బీఆర్ఎస్ ఒకే ఒక్క వార్డుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మిర్యాలగూడ, దేవరకొండలోనూ అదే జోరు
జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీ అయిన మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇక్కడ మొత్తం 48 వార్డుల్లో పోటీ జరగగా, 31 స్థానాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ 14 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీకి ఒక చోట, ఇతరులకు రెండు చోట్ల విజయం దక్కింది. ఇక దేవరకొండలోనూ కాంగ్రెస్ 11 వార్డులను గెలుచుకుని మున్సిపాలిటీని కైవసం చేసుకోగా.. బీఆర్ఎస్ 6, బీజేపీ 1, ఇతరులు 2 వార్డుల్లో విజయం సాధించారు.

Read More ప్రమాణ స్వీకారం అనంతరం తొలి అభివృద్ధి పనికి శ్రీకారం చుట్టిన సర్పంచ్ ఉల్లి నరేష్ కుమార్ 

చిట్యాల, చండూరులో గులాబీ పార్టీకి నిరాశే
చిట్యాల మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను 9 చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. బీఆర్ఎస్ కేవలం 2 వార్డులకే పరిమితం కాగా, మరొకటి ఇతరుల పరమైంది. అటు చండూరులోనూ 10 వార్డుల్లో 6 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించగా, బీఆర్ఎస్ 3 చోట్ల, ఒక స్వతంత్ర అభ్యర్థి ఒక చోట విజయం సాధించారు.

కాంగ్రెస్ క్యాంప్‌లో సంబరాలు
ఈ ఫలితాలతో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. మిఠాయిలు పంచుకుంటూ, బాణసంచా కాలుస్తూ తమ విజయాన్ని ఘనంగా చాటుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ దాదాపు అన్ని మున్సిపాలిటీల్లోనూ రెండో స్థానానికే పరిమితం కాగా, బీజేపీ ప్రభావం నామమాత్రంగానే ఉండిపోయింది. ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, స్థానిక నేతల కృషే ఈ విజయానికి కారణమని గెలిచిన అభ్యర్థులు పేర్కొంటున్నారు.