తెలంగాణకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. నాలుగులేన్ల జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్

తెలంగాణకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. నాలుగులేన్ల జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్

 తెలంగాణ రవాణా రంగంలో మరో కీలక ముందడుగు పడనుంది. హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా జాతీయ రహదారి-167ను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

విశ్వంభర, నేషనల్ బ్యూరో: తెలంగాణ రవాణా రంగంలో మరో కీలక ముందడుగు పడనుంది. హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా జాతీయ రహదారి-167ను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు కింద తెలంగాణలోని గుడేబెల్లూర్ నుండి మహబూబ్‌నగర్ వరకు సుమారు 80 కిలోమీటర్ల మేర రహదారిని 4-లేన్ల ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. రాయచూర్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్ నగర్ మీదుగా సాగే ఈ రహదారి వల్ల హైదరాబాద్‌కు కనెక్టివిటీ మెరుగుపడటమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్థిక, సామాజిక, లాజిస్టిక్స్ కేంద్రాలకు రవాణా సులభతరం కానుంది.

దేశవ్యాప్తంగా మూడు కీలక రైల్వే ప్రాజెక్టులు
రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే దిశగా ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని 12 జిల్లాలను కవర్ చేస్తూ సుమారు రూ.18,509 కోట్ల అంచనా వ్యయంతో మూడు ప్రధాన మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 2030-31 నాటికి పూర్తి కానున్న ఈ ప్రాజెక్టులలో కాసారా - మన్మాడ్ 3వ, 4వ లైన్, ఢిల్లీ - అంబాలా 3వ, 4వ లైన్, బల్లారి - హోసాపేట 3వ, 4వ లైన్ ఉన్నాయి. ఈ నిర్మాణాల ద్వారా సుమారు 265 లక్షల మానవ-రోజుల ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. పీఎం-గతి శక్తి మాస్టర్ ప్లాన్ ఆధారంగా రూపొందించిన ఈ ప్రాజెక్టుల వల్ల రవాణా ఖర్చులు తగ్గి, చమురు దిగుమతులు తగ్గి, కార్బన్ ఉద్గారాల నియంత్రణకు దోహదపడుతుంది.

Read More పాక హనుమంతు (గణేష్ ఉయికె) 2022 నవంబర్ లో తల్లికి రాసిన ఉత్తరం

అస్సాంలో బ్రహ్మపుత్ర నది కింద టన్నెల్
ఈ సమావేశంలో అస్సాం అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటూ, NH-15లోని గోహ్‌పూర్ నుండి నుమాలిఘర్ వరకు నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ కనెక్టివిటీకి ఆమోదం లభించింది. ఇందులో భాగంగా బ్రహ్మపుత్ర నది కింద 15.79 కిలోమీటర్ల పొడవైన రోడ్-కమ్-రైల్ టన్నెల్‌ను రూ. 18,662 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. అలాగే, మహారాష్ట్రలో రూ. 3,320 కోట్ల వ్యయంతో NH-160A లోని ఘోటి - త్రింబక్ - జవహర్ - మనోర్ - పాల్ఘర్ సెక్షన్‌ను రెండు/నాలుగు లేన్లుగా అప్‌గ్రేడ్ చేయడానికి కమిటీ ఆమోదం తెలిపింది.