ఖమ్మంలో 'క్యాంపు' రాజకీయం
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గెలిచిన అభ్యర్థులు తమ పార్టీని వీడిపోకుండా ఉండేందుకు, ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలు 'క్యాంపు రాజకీయాలకు' తెరలేపాయి.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గెలిచిన అభ్యర్థులు తమ పార్టీని వీడిపోకుండా ఉండేందుకు, ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలు 'క్యాంపు రాజకీయాలకు' తెరలేపాయి. ముఖ్యంగా సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో అధికార పీఠం దక్కించుకునేందుకు ఈ తరహా వ్యూహాలు పన్నుతున్నారు.
సత్తుపల్లిలో కాంగ్రెస్ వ్యూహం
సత్తుపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీని సాధించినప్పటికీ, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగే వరకు అభ్యర్థులను సురక్షితంగా ఉంచాలని నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా, గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్లను ప్రత్యేక వాహనాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ లేదా విశాఖపట్నం వంటి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం.
కల్లూరుపై ప్రత్యేక ఫోకస్
కొత్తగా ఏర్పడిన కల్లూరు మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గెలిచిన అభ్యర్థులను ఇతర పార్టీలు ప్రలోభపెట్టకుండా ఉండేందుకు, వారిని రాత్రికి రాత్రే హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సమయానికి వీరిని నేరుగా కల్లూరుకు తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
చైర్మన్ అభ్యర్థి కోసం ఉత్కంఠ
సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థులు ఎవరనే దానిపై పార్టీల లోపల తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయతను బట్టి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అప్పటివరకు కౌన్సిలర్లందరినీ ఐకమత్యంగా ఉంచడం కోసం ఈ క్యాంపు రాజకీయాలు అనివార్యమయ్యాయని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు.



