రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున 330కి పైగా అభ్యర్థులు పోటీలో నిలిచారని, ప్రజల నుండి ఆశించిన స్థాయిలో మద్దతు లభించిందని పార్టీ నేతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ రెండు చోట్ల విజయం సాధించి ఖాతా తెరిచింది. మంచిర్యాల కార్పొరేషన్‌లో 34వ డివిజన్ నుండి పోటీ చేసిన జనసేన కార్పొరేటర్ అభ్యర్థి అగ్గు సాగర్ 31 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ 14వ వార్డు నుండి పోటీ చేసిన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి నాగేశ్వరరావు 29 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే పార్టీ నాయకులు, శ్రేణులు, వీర మహిళలు ఎంతో కష్టపడి పనిచేశారని కొనియాడారు. వారి కృషికి పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తరుపున, తెలంగాణ రాష్ట్ర నాయకత్వం తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తమను గుర్తించి ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో మరింత బలం
తెలంగాణ ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ, రెండు చోట్ల గెలవడం సంతోషకరమని, ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో కూడా బలంగా పోటీ చేస్తామని వెల్లడించారు. సినీ నటుడు ఆర్కే సాగర్ మాట్లాడుతూ.. గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, జనసేన పార్టీని రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.



