మున్సిపల్ ఫలితాల ప్రభావం అసెంబ్లీపై ఉండదు
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఏమాత్రం ఉండదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఏమాత్రం ఉండదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మున్సిపల్ పీఠాల దక్కించుకునే క్రమంలో ఎక్స్ అఫీషియో ఓట్ల నమోదు ప్రక్రియ అత్యంత కీలకమని, దీనిపై స్పష్టత కోరుతూ ఆయన పార్టీ ముఖ్య నేతలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌లను కలిశారు. అనంతరం మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తాము 30కి పైగా మున్సిపాలిటీలు గెలుస్తామని అంచనా వేశామని, అయితే ఆ సంఖ్య కొంత మేర తగ్గిందని అంగీకరించారు. అయినప్పటికీ హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో కూడా సమీకరణాలు తమకే అనుకూలంగా మారుతాయని, అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు అవసరమైన వ్యూహాలతో తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు
అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై కేటీఆర్ ఘాటుగా స్పందిస్తూ.. ఆ పార్టీకి కూడా ప్రజలు ఆశించిన మేర మున్సిపాలిటీలను అప్పగించలేదని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ ప్రభావం కేవలం కరీంనగర్, నిజామాబాద్ వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఆ పార్టీ ఉనికి ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. పొత్తుల విషయానికొస్తే, స్థానిక పరిస్థితులను బట్టే ఎన్నికల పొత్తులు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కొత్తగూడెంలో సీపీఐతో సఖ్యత
కొత్తగూడెం మున్సిపాలిటీలో తాము సీపీఐకి మద్దతు ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందనే బలమైన సందేశం పంపడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ వివరించారు. ఈ ఫలితాలను విశ్లేషించుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని ఆయన స్పష్టం చేశారు.



