గద్వాల గడ్డపై 'సింహం' గర్జన

గద్వాల గడ్డపై 'సింహం' గర్జన

 తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని సంచలనం నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ ఫలితాలు రాష్ట్ర రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని సంచలనం నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ ఫలితాలు రాష్ట్ర రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతుదారులు ఇక్కడ ప్రభంజనం సృష్టించి, మున్సిపాలిటీని తమ ఖాతాలో వేసుకున్నారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా, ఫలితాలు కవిత మద్దతుదారులకు ఏకపక్షంగా అనుకూలించాయి. కవిత  మద్దతుదారులు 8 వార్డుల్లో గెలుపొందగా, అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక వార్డుకు పరిమితం కాగా, బీఆర్ఎస్ కూడా ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. 

'సింహం' గుర్తుతో స్వతంత్ర పంథా
ఈ ఎన్నికల్లో కవిత అనుచరులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున 'సింహం' గుర్తుపై పోటీ చేశారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో కవితకు ఉన్న ప్రజాధారణ ముందు అవేవీ నిలవలేదు. తెలంగాణ జాగృతి ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలే తమను గెలిపించాయని విజేతలు ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం విజయం మాత్రమే కాదు, కవితమ్మ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని గెలుపొందిన అభ్యర్థులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో తాము చేసిన సేవను గుర్తించి ఓటర్లు తమకు పట్టం కట్టారని తెలిపారు.

Read More అయ్యప్ప స్వామి దీవెనలతో గణిపాక సుధాకర్ అమరావతిల పెళ్లిరోజు కార్యక్రమం

రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు సాగుతుంటే, వడ్డేపల్లిలో మాత్రం ఒక మూడవ వర్గం మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విజయం కవిత రాజకీయ భవిష్యత్తుకు కొత్త ఊపిరి పోసినట్లయింది. ఫలితాలు వెలువడగానే వడ్డేపల్లి పట్టణంలో కవిత మద్దతుదారులు బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు.