కరీంనగర్ కోటపై కాషాయ జెండా.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కరీంనగర్ కార్పొరేషన్ వేదికగా బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేసి బీజేపీ రికార్డు సృష్టించింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కరీంనగర్ కార్పొరేషన్ వేదికగా బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేసి బీజేపీ రికార్డు సృష్టించింది. ఈ విజయంతో కరీంనగర్ నగరం కాషాయమయమైంది. ఫలితాల అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఈ విజయం అవినీతి రహిత పాలనకు, నరేంద్ర మోదీపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా.. ఓటుకు రూ.7 వేలు పంచినా ప్రజలు ధర్మం వైపే నిలబడ్డారని బండి సంజయ్ స్పష్టం చేశారు.
హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగురవేస్తాం
కరీంనగర్ తీర్పు స్పూర్తితో రాబోయే రోజుల్లో హైదరాబాద్‌పై కూడా కాషాయ జెండా ఎగురవేస్తామని బండి సంజయ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఒవైసీ బ్రదర్స్ కళ్లలో ఆనందం చూడటానికే రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసి, ఒక ముక్కను మజ్లిస్‌కు రాసిచ్చారని విమర్శించారు. ఈ విభజనే రేవంత్ రెడ్డి పాలిట రాజకీయ మరణశాసనం కాబోతోందని, హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లను కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో సంసారం చేస్తూ బీఆర్ఎస్‌కు కన్ను కొడుతున్న ఎంఐఎంకు ప్రజలు చెంపచెళ్లుమనిపించే తీర్పు ఇచ్చారని, ఆ పార్టీ కార్యాలయం ఉన్న డివిజన్‌లోనే బీజేపీ జెండా పాతామని గుర్తు చేశారు.
రూ.1,500 కోట్లతో అభివృద్ధి
కరీంనగర్ అభివృద్ధి విషయంలో విపక్షాలు చేసిన విమర్శలను బండి సంజయ్ తిప్పికొట్టారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికే నగరాభివృద్ధి కోసం రూ.1,500 కోట్లు కేటాయించిందని, కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్క నయాపైసా కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. తాను సామాన్య కార్యకర్తను.. ఎమ్మెల్యేగా ఓడినా, కార్పొరేటర్‌గా, ఎంపీగా తనను గెలిపించి ఈ స్థాయికి తెచ్చిన కరీంనగర్ ప్రజలకు శిరస్సు వంచి వందనం చేస్తున్నానని అన్నారు. ఐదేళ్లలో కరీంనగర్ అభివృద్ధిని చేతల్లో చూపిస్తామని స్పష్టం చేశారు.
అవినీతికి తావులేకుండా కార్పొరేషన్ ప్రక్షాళన చేస్తానని, పాలనను నేరుగా ప్రజల వద్దకే తీసుకువెళ్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. గెలిచిన 33 మంది బీజేపీ అభ్యర్థులతో పాటు, మద్దతు తెలుపుతున్న స్వతంత్రులు, ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని కలుపుకుని నగరాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఈ అద్భుత విజయాన్ని తాను నమ్ముకున్న మహాశక్తి అమ్మవారికి అంకితం ఇస్తున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు.



