సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ వార్షిక బడ్జెట్

సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ వార్షిక బడ్జెట్

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,32,205 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల ప్రజల అవసరాలను, రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు ఆయన వెల్లడించారు.

విశ్వంభర, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,32,205 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల ప్రజల అవసరాలను, రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ వార్షిక బడ్జెట్‌లో సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు.

వ్యవసాయ రంగానికి భారీ కేటాయింపులు
రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ వ్యవసాయ రంగానికి మొత్తంగా రూ.11,745 కోట్లను కేటాయించింది. ఇందులో పంట బీమా పథకం కోసం రూ.250 కోట్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న 'ప్రధాన మంత్రి కృషి సంచాయ్ యోజన' పథకానికి రూ.190 కోట్లు కేటాయించారు. దీనివల్ల రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Read More భద్రాద్రికి భక్తుల తాకిడి 

బలోపేతం కానున్న మున్సిపాలిటీలు
రాష్ట్రంలోని మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా మున్సిపల్ శాఖకు రూ.14,339 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. ఈ నిధుల ద్వారా పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా వంటి పనులను వేగవంతం చేయనున్నారు.

పోలీస్ శాఖ ఆధునీకరణ
శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ప్రభుత్వం భారీగా నిధులు ప్రకటించింది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పోలీసు శాఖ వాహనాల కొనుగోలు కోసం రూ. 3,000 కోట్లను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్రంలో అత్యాధునిక పోలీస్ అకాడమీని ఏర్పాటు చేయడానికి 94 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

విద్యారంగానికి నిధుల వర్షం
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇతర స్కాలర్‌షిప్‌ల కోసం రూ.3,836 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. దీనితో పాటు 'తల్లికి వందనం' పథకానికి రూ.9,668 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.32,308 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.2,567 కోట్లు కేటాయిస్తూ విద్యారంగానికి పెద్దపీట వేశారు.