విజయ్ ప్రచార సభలో విషాదం.. గుండెపోటుతో మహారాష్ట్ర వ్యక్తి మృతి

విజయ్ ప్రచార సభలో విషాదం.. గుండెపోటుతో మహారాష్ట్ర వ్యక్తి మృతి

తమిళనాడులో తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో విషాదం చోటుచేసుకుంది. 

విశ్వంభర, నేషనల్ బ్యూరో: తమిళనాడులో తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో విషాదం చోటుచేసుకుంది. సేలంలో నిర్వహించిన ర్యాలీలో మహారాష్ట్రకు చెందిన 37 ఏళ్ల సూరజ్ అనే వ్యక్తి హఠాత్తుగా స్పృహ కోల్పోయి మృతి చెందాడు. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో జనసమూహంలో నుండి ఒక్కసారిగా కిందపడిపోవడంతో స్థానికులు, పోలీసులు అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతికి కారణం గుండెపోటు అని వైద్యులు పేర్కొన్నారు. ఉపాధి కోసం కుటుంబంతో సహా సేలానికి వలస వచ్చిన సూరజ్, కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అనుమతికి మించి తరలిన జనం
ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కానీ, నిర్వాహకులు అనుమతి పొందిన సంఖ్య కంటే ఎక్కువ మందిని సభకు అనుమతించడంతో వేదిక ప్రాంగణం కిక్కిరిసిపోయింది. 5వేల మందికి మాత్రమే అనుమతి ఉంది. అయితే దాదాపు 7 వేల మంది జనం రావడంతో తోపులాట వంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై పూర్తి విచారణ జరిపి నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్‌లో కరూర్‌లో విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Read More సిరికి జెమిని ఏఐ పవర్..!!