మాజీ మేయర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపణలు
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, 38వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి దేశబోయిన హారిక కౌంటింగ్ కేంద్రం వెలుపల ఆందోళనకు దిగారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, 38వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి దేశబోయిన హారిక కౌంటింగ్ కేంద్రం వెలుపల ఆందోళనకు దిగారు. బీజేపీ అభ్యర్థి, మాజీ మేయర్ సునీల్ రావు అధికారులను బెదిరిస్తున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. 'తమ ప్రత్యర్థులైతే గెలవాలి.. మీ సంగతి చెబుతాను.. మీకు వాళ్లు ఏమైనా ఇచ్చారా..?' అంటూ సునీల్ రావు అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని హారిక పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
మళ్లీ లెక్కించాలని డిమాండ్
కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న పోలీసులు మాజీ మేయర్‌కు వంత పాడుతున్నారని హారిక ఆరోపించారు. అధికారుల తీరును నిలదీసినా పోలీసులు స్పందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను 38వ డివిజన్‌లో గెలిచినా, ఓడినా అభ్యంతరం లేదని, కానీ తమ డివిజన్‌కు సంబంధించిన ప్రతి ఒక్క ఓటును మళ్లీ లెక్కించాలని ఆమె ఎన్నికల అధికారులను డిమాండ్ చేశారు.



