దుబ్బాకలో 'లక్కీ' విక్టరీ
ఎన్నికల రణరంగంలో ఒక్క ఓటు కూడా ఎంత విలువైనదో దుబ్బాక మున్సిపాలిటీ ఫలితం మరోసారి నిరూపించింది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక 3వ వార్డులో జరిగిన పోరు సినిమా క్లైమాక్స్‌ను తలపించింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఎన్నికల రణరంగంలో ఒక్క ఓటు కూడా ఎంత విలువైనదో దుబ్బాక మున్సిపాలిటీ ఫలితం మరోసారి నిరూపించింది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక 3వ వార్డులో జరిగిన పోరు సినిమా క్లైమాక్స్‌ను తలపించింది. ఇక్కడ గెలుపు గుర్రం ఎవరనేది ఓటర్ల తీర్పుతో కాకుండా, చివరకు అదృష్టం ద్వారా తేలడం విశేషం. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్లు సాగింది. ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యం దోబూచులాడింది. చివరకు లెక్కింపు పూర్తయ్యేసరికి ఇద్దరు అభ్యర్థులకు ఖచ్చితంగా సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు అధికారులు ఎక్కడా పొరపాట్లకు తావుండకూడదని భావించి ఏకంగా రెండుసార్లు రీ-కౌంటింగ్ నిర్వహించారు. కానీ, ఫలితంలో ఎలాంటి మార్పు రాలేదు.
ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఓట్లు సమానంగా వస్తే విజేతను 'లక్కీ డ్రా' ద్వారా నిర్ణయించాల్సి ఉంటుంది. దీంతో అధికారులు ఇద్దరు అభ్యర్థుల పేర్లను చిన్న కాగితపు స్లిప్పులపై రాసి, ఒక బాక్సులో వేశారు. కౌంటింగ్ కేంద్రంలోని అధికారులు తీసిన ఆ లక్కీ డ్రాలో బీఆర్ఎస్ అభ్యర్థి పేరు వచ్చింది. దీంతో గులాబీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. కేవలం అదృష్టంతోనే ఈ విజయం వరించడంతో ఇది స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. గెలిచిన అభ్యర్థి తన విజయాన్ని దైవ నిర్ణయంగా భావిస్తుండగా, బీజేపీ అభ్యర్థి మాత్రం అత్యల్ప తేడాతో, అది కూడా లక్కీ డ్రాలో ఓడిపోవడంపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, దుబ్బాక మున్సిపల్ ఎన్నికల చరిత్రలో ఈ 'లక్కీ డ్రా' విజయం ఒక ప్రత్యేకమైన ఘట్టంగా నిలిచిపోనుంది.



