సిట్ అనేది రేవంత్ చేతిలో కీలుబొమ్మ!
రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసుల అందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసుల అందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గురువారం సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి 'డైవర్షన్ పాలిటిక్స్' చేస్తోందని ధ్వజమెత్తారు. సిట్ అనేది రేవంత్ రెడ్డి సిట్ అంటే కూర్చుంటుంది.. స్టాండ్ అంటే నిలబడుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం, కారు రేస్, గొర్రెల పంపిణీ.. ఇలా రోజుకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ 'కార్తీకదీపం' సీరియల్ లాగా సాగదీయడం తప్ప ఇందులో వాస్తవం ఏమీ లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సింగరేణి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే తనతో పాటు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు.
ట్యాపింగ్ నేరమెలా అవుతుంది?
ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ట్యాపింగ్ చేయడం నేరమేం కాదు. 1952 నుంచి దేశ భద్రత కోసం, ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రల నుంచి రక్షించేందుకు నిఘా వ్యవస్థలు ఈ పని చేస్తూనే ఉన్నాయి. ఇది పూర్తిగా పోలీసు వ్యవస్థ కనుసన్నల్లో జరిగే ప్రక్రియ. ఇందులో మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎలాంటి సంబంధం ఉండదు. ప్రభుత్వానికి కావాల్సిన సమాచారం కోసం పోలీసులు సమాచారాన్ని సేకరిస్తారు" అని ఆయన వివరించారు.
ముందు డీజీపీని విచారించండి
ఈ కేసులో తనను, హరీష్ రావును పిలవడంలో అర్థం లేదని కేటీఆర్ అన్నారు. "ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందుగా విచారించాల్సింది ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డినే. ఆయనను వదిలేసి మమ్మల్ని పిలిస్తే ఏం వస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్నారు. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తే వీళ్లంతా జైలుకు వెళ్లడం ఖాయం" అని హెచ్చరించారు.
విచారణకు వెళ్తాను
సిట్ ఇచ్చిన నోటీసుల మేరకు తాను విచారణకు వెళ్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇది పూర్తిగా అబద్ధపు కేసు అని, ఇందులో ఎలాంటి ఆధారాలు లేవని ఆయన కొట్టిపారేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. హామీలు అమలు చేయలేకనే రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర రాజకీయాలకు తెరలేపుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.



