కాస్య తండాలో నీటి కరవు

కాస్య తండాలో నీటి కరవు

విశ్వంభర, నెల్లికుదురు: కాస్య తండా తోపాటు గ్రామపంచాయతీ పరిధిలోని తండాల్లో గిరిజన ప్రజలు నీటి కరువుతో సతమతమవుతున్నారని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాస్య తండా సర్పంచ్ బోడ నర్సింహ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీరు సైతం గత మూడు నెలలుగా రావడం లేదన్నారు. దీంతో జిపి పరిధిలోని ఐదు వాటర్ ట్యాంకులు ఖాళీగానే ఉంటున్నాయన్నారు. ఈ మేరకు సర్పంచి సోమవారం వాటర్ ట్యాంకుల పైకి ఎక్కి ఖాళీగా ఉన్న ట్యాంకులను పరిశీలించారు.సర్పంచిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సంబంధిత ఏయిలు,మండల అధికారుల దృష్టికి తండాలో నెలకొన్న నీటి సమస్య ను పలుమార్లు తీసుకువెళ్లినప్పటికీ చేస్తాం..చూస్తాం..అంటూ దాటవేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాప్రతినిధులు,అధికారులు వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామని ఆర్భాటమైన ప్రకటనలు చేస్తున్నారని, కాస్య తండకు ఓ సారి ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు వచ్చి చూస్తే నీటి తీవ్రత తెలుస్తుందన్నారు. ప్రజాధనంతో,ప్రజల కోసం నియమింపబడిన అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని ఆ అధికారులు ఉంటేనేం లేకుంటే నేం అంటూ విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు, నియోజకవర్గ,జిల్లా ప్రజా ప్రతినిధులు తండాకు నీటి సౌకర్యం కల్పించి గిరిజన ప్రజలను ఆదుకోవాలని కోరారు.

Tags: