జిహెచ్ఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
విశ్వంభర, జి హెచ్ఎంసి : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సోమవారం ఉదయం గోషామహల్, కార్వాన్ సర్కిళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ భగత్ సింగ్ జంక్షన్ వద్ద కొనసాగుతున్న జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. అక్కడి ఇందిరమ్మ కాంటీన్‌ను తనిఖీ చేసి, పరిసర ప్రాంతాల్లోని రోడ్లు, రహదారులపై తక్షణమే ప్యాచ్ వర్క్‌లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తద్వారా ప్రజలకు రాకపోకలు సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని సూచించారు. పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తున్న ప్రజా మరుగుదొడ్ల నిర్వహణపై కమిషనర్ సమీక్షించారు. అక్కడి కేర్‌టేకర్ వద్ద సిబ్బంది హాజరును పరిశీలించి, మరుగుదొడ్లను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు ఆదేశించారు.అనంతరం గోల్కొండ జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి, ఏసీ (సానిటేషన్) రవికిరణ్, ఇంజినీరింగ్ మరియు శానిటేషన్ విభాగాల అధికారులు, రామ్‌కీ సంస్థ ప్రతినిధులతో కలిసి సమీప రహదారులు, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు (జీవీపీలు) కాలినడకన పరిశీలించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని, ఆ భవనాన్ని ఉగాది సందర్భంగా ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత కమిషనర్ జియాగూడ 100 ఫీట్ రోడ్డును పరిశీలించారు. శానిటేషన్, రహదారి నిర్వహణ పనుల పురోగతిని కమిషనర్ సమీక్షించారు. అభివృద్ధి పనులను మరింత వేగం చేయాలని అధికారులకు కమిషనర్ దిశా నిర్దేశం చేశారు.తనిఖీల్లో జోనల్ కమిషనర్, ఎస్‌ఈ, ఈఈ, డీఈఈలు, ఏఈలు మరియు కర్వాన్ సర్కిల్ శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.



