మండల కేంద్రంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కొనసాగించాలి
విశ్వంభర, మహేశ్వరం :మహేశ్వరం మండల కేంద్రంలో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఇతర ప్రాంతాలకు తరలించాలనే ఊహాగానాలపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మహేశ్వరం, శంషాబాద్ ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కలిపి ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంగా ఏర్పాటు చేసి, జిహెచ్ఎంసి పరిధిలోని మంఖాల్ రెవెన్యూ ప్రాంతంలో నిర్మించనున్నట్లు ఇటీవల పత్రికలలో వార్తలు వస్తుండటంతో మహేశ్వరం మండల ప్రజలు దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్వరం గ్రామం 1995 సంవత్సరంనుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కేంద్రంగా కొనసాగుతూ, నియోజకవర్గ ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలను సులభతరం చేస్తోంది, ఈ కార్యాలయం ద్వారా ప్రభుత్వానికి కూడా అధిక మొత్తంలో ఆదాయం సమకూరుతోంది, ఇటీవల మహేశ్వరం ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతూ ఉండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి, రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది,అదేవిధంగా మహేశ్వరం ప్రాంతం కందుకూరు, కడ్తాల్, ఆమనగల్ ప్రాంతాలకు మధ్యస్థంగా ఉండటంతో ఆ ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడే సులభంగా రిజిస్ట్రేషన్లు నిర్వహించుకుంటున్నారు. ఒకవేళ ఈ కార్యాలయాన్ని జిహెచ్ఎం పరిధిలోకి తరలిస్తే ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు, సమయం ఇతర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్వరం మండల ప్రజలు తమ బాధలను రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ అధికారులకు తెలియజేశారు. అనంతరం అధికారులు మహేశ్వరం మండల పరిధిలోని సిరిగిరిపురం గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 71లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా ఆర్డీవో కూడా ఆ ప్రదేశాన్ని సందర్శించి సర్వే నిర్వహించినట్లు తెలిసింది.
కాబట్టి మహేశ్వరం మండల కేంద్రంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కొనసాగించాలని మహేశ్వరం మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మహేశ్వరం సర్పంచ్ మునగపాటి నవీన్ ఆధ్వర్యంలో మహేశ్వరం మండల సర్పంచులతో కలిసి కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవుళ్ళ నాయక్, పద్మ కృష్ణ , జగదీష్, శంకరయ్య, జ్యోతి కుమార్ నాయక్, జయమ్మ కృష్ణ , పోతుళ్ళ మల్లమ్మ , క్రిష్ణవేణి శ్రీనివాస్, మొతిలాల్ జ్యోతి ,సిల్వారెడ్డి, లక్ష్మమ్మ,చంద్రయ్య, అంబయ్య, పాండు యదవ్, వెంకటవీర్ రెడ్డి, చంద్రశంకర్ రెడ్డి జోమల రమేష్, హనుమంతు, రాజు నాయక్ , రవి,దుడ్డి కృష్ణ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.



