అభివృద్ధి పనులకు శంకుస్థాపన
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం పరిధిలోని గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపనలు నిర్వహించారు. అందులో భాగంగా మండలంలోని నీర్నేముల గ్రామంలో నూతనంగా నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘ భవన నిర్మాణ పనులకు మరియు సి.సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నిధానపల్లి గ్రామంలో సి.సి రోడ్డు మరియు మహిళా సమాఖ్య సంఘ భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కొమ్మాయిగూడెం గ్రామంలో సి.సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రామన్నపేట మండల కేంద్రంలో రూ.10.00 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘం భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జనంపల్లి గ్రామంలో రూ.20.00 లక్షల వ్యయంతో చేపట్టనున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మెరుగైన రహదారి సదుపాయాలు అత్యంత అవసరమని, ప్రజల రాకపోకలకు సౌలభ్యం కలిగించే విధంగా నాణ్యమైన పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువస్తామని తెలిపారు. మహిళా సంఘాలకు శాశ్వత భవనాలు నిర్మించడం ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి పట్ల తన కట్టుబాటును మరోసారి చాటిచెప్పిన ఎమ్మెల్యే కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



