ప్రజలను వంచించడం అన్యాయం
- ప్రభుత్వంపై భాజపా నేతల ఆగ్రహం
విశ్వంభర,మేడ్చల్: తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి సాధ్యం కాని వాగ్దానాలు చేసి, గద్దెనెక్కిన తర్వాత ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉమ్మడి కీసర మండల స్థానిక భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయకుండా పేద ప్రజలకు మొండి చేయి చూపడం అన్యాయమని వారు మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కీసర మండలం డివిజన్ అధ్యక్షులు కోల బాలరాజు యాదవ్, ఉండబోయిన నాగరాజు యాదవ్, తోట నరేష్ పటేల్ నేతృత్వంలో సోమవారం కీసర తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా భాజపా నేతలు మాట్లాడుతూ, ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 6 గ్యారెంటీలను ఎటువంటి నిబంధనలు లేకుండా వెంటనే అమలు చేయాలి. పేద ప్రజలను వంచిస్తున్న తీరును మానుకొని, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం, తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కీసర తహశీల్దార్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.



