ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు
విశ్వంభర, బషీర్ బాగ్: పవిత్రమైన ఉగాది పండుగ నుంచి శ్రీరామనవమి వరకు ఉత్సవాలను సైదాబాద్ లోని లక్ష్మీనగర్ లోగల శ్రీషిర్డి సాయిబాబా మందిరంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు విశ్వ భక్తి సేవ ప్రచార్ పరివార్ ప్రచారకులు ఓం స్వామి స్వరూప జీ తెలిపారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షిరిడి సాయి సమితి ప్రతినిధులు వి. సుబ్రహ్మణ్యశాస్త్రి, పి.రామకృష్ణ, ఎన్. ప్రసాదరావులతో కలసి ఆయన మాట్లాడుతూ , ఉగాది పర్వదినాన ప్రత్యేకంగా పూజలు కొనసాగుతాయన్నారు. ఈనెల 27వ తేదీ శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆ రోజు ఉదయం 6.30 గంటలకు బాబాకు, సీతారాములకు పాలాభిషేకం, 8 గంటలకు భక్తులచే భిక్షాటన, 9.30 గంటలకు భక్తులచే శ్రీసీతారాముల కళ్యాణం, 12.30 గంటలకు శ్రీసీతారామచంద్రవారి కళ్యాణ విందు భోజనం, రాత్రి 8 గంటలకు కళ్యాణ సీతారాములు రథోత్సవం, శ్రీషిర్డి బాబాకు జెండా ఉత్సవం, చందనోత్సవం జరుగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి ఆశీస్సుల కృపకు పాత్రులు కావాలని కోరారు.



