ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి
- జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
విశ్వంభర, మహబూబాబాద్: సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లాలోని అన్ని విభాగాల అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా వ్యాప్తంగా ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి కచ్చితంగా సమాధానం ఇస్తూ తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెండింగ్ ఫైళ్ళ పరిష్కారం, కార్యాలయాల పరిశుభ్రత తదితర అంశాలను కచ్చితంగా అమలుపరచాలని, పరిష్కరించిన ఫైళ్ళ వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల అధికారులు, క్షేత్రస్థాయి మండల అధికారులకు సూచించారు. సీనియర్ సిటిజన్స్, భూ సంబంధిత, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, వ్యవసాయం, ఇరిగేషన్, దివ్యాంగుల పెన్షన్, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు, తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి నివేదిక సమర్పించాలన్నారు. మండల ప్రధాన కార్యాస్థానం నుండి గూగుల్ మీట్ ద్వారా సంబంధిత ఇనుగుర్తి, గార్ల, డోర్నకల్, కేసముద్రం, చిన్న గూడూరు, తహసిల్దార్లతో భూ సమస్య పరిష్కారం చేయుటకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం దంతాలపల్లి మండలం తూర్పు తండ గ్రామ పంచాయతీ కి చెందిన గుగులోతు నాగమణి తనకు చెందిన భూమిని నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగా భవన నిర్మాణానికి మంజూరి ఉత్తర్వులు ఇవ్వగా ఇప్పుడు కొత్తగా ఎన్నికైన పాలక వర్గం అట్టి భవన నిర్మాణం మరొక స్థలంలో నిర్మిస్తున్నారని, ఈ విషయంలో హైకోర్ట్ వారిని సంప్రదించామని, విచారణ చేసి హైకోర్టు నుండి తీర్పు వెలువడే వరకు అట్టి గ్రామ పంచాయతీ భవనానికి నిధులు మంజూరు చేయకుండా నిలుపుదల చేయమని కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో అన్ని జిల్లాల కార్యాలయ అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, పర్యవేక్షకులు మదన్ గోపాల్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.



