స్పాట్ రేట్లు 50శాతం పెంచాలి

స్పాట్ రేట్లు 50శాతం పెంచాలి

విశ్వంభర, హైదరాబాదు : ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని స్పాట్ రేట్లను 50 శాతం పెంచాలని టీఎస్ యుటీఎఫ్ డిమాండ్ చేసింది. గత సంవత్సరం మూల్యాంకనం చేసిన ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన రెమ్యూనరేషన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరింది. 2018లో రాష్ట్ర ప్రభుత్వం స్పాట్ రేట్లను సవరించిందని, గత ఎనిమిది సంవత్సరాలుగా అదే రేట్లు అమలులో ఉన్నాయని సంఘం పేర్కొంది. ఈ మధ్య కాలంలో ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం రేట్లు రెండు సార్లు పెరిగాయని, అదే విధంగా పదవ తరగతి మూల్యాంకనం రేట్లను కూడా పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది. గత సంవత్సరం మూల్యాంకనం విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఇప్పటివరకు రెమ్యూనరేషన్ చెల్లించలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో స్పాట్ కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్ సోమవారం ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు పి వి శ్రీహరిని కలిసి వినతిపత్రం అందజేశారు. బడ్జెట్ ఇటీవల విడుదలైందని, బిల్లులు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపించామని, స్పాట్ రేట్ల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తామని ఆయన తెలిపారు.

Tags: