పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలి : మంత్రి కోమటిరెడ్డి

"జగ్గారెడ్డి మరో పీజేఆర్‌".. ఆయన పీసీసీ చీఫ్‌ అయితే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు పక్క..

పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలి : మంత్రి కోమటిరెడ్డి

విశ్వంభర,హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియా చిట్‌ చాట్ లో మాట్లాడుతూ జగ్గారెడ్డి ఎప్పుడూ జనంలో ఉండే మాస్‌ లీడర్‌ అని, అందుకే  టీపీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలని కోరారు. జగ్గారెడ్డి మరో పీజేఆర్‌ అని, ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే ఆదుకుంటారని చెప్పుకొచ్చారు. ఆయన పీసీసీ చీఫ్‌ అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు వస్తాయని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.వెంకట్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ హైకమాండ్ మార్చవచ్చన్న ప్రచారానికి తెర లేపింది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందని, అందులో భాగాంగానే పీసీసీ చీప్ మార్పు జరుగుతుందన్న వాదన వినిపిస్తుంది. గతంలో జగ్గారెడ్డి తను ఇకమీదట ఎన్నికల్లో పోటీ చేయబోనని, తన లక్ష్యం పీసీసీ చీఫ్, సీఎం పదవి అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.హ్యామ్ రోడ్లపై రూ.18వేల కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి టి.హరీశ్ రావు చేసిన ఆరోపణలను మంత్రి వెంకట్ రెడ్డి కొట్టిపారేశారు. అసలు అన్ని కోట్ల టెండర్లు పిలవనప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని ఆయన  ప్రశ్నించారు.