మేడారం మహా జాతరకు కేంద్రం భారీ నిధులు
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, కోట్లాది మంది భక్తుల కొంగుబంగారం మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ప్రకటించింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, కోట్లాది మంది భక్తుల కొంగుబంగారం మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ప్రకటించింది. ఈ జాతర ఏర్పాట్లు, భక్తుల సౌకర్యార్థం రూ. 3.70 కోట్ల నిధులను విడుదల చేస్తూ శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటక, గిరిజన శాఖల ఉమ్మడి నిధులు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ నిధులను కేటాయించాయి. రెండేళ్లకోసారి జరిగే ఈ మహా ఉత్సవానికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుండటంతో, వారి కోసం మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచే మేడారం జాతర విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గిరిజన సంప్రదాయాలను, విశ్వాసాలను కాపాడేందుకు కేంద్రం నిరంతరం మద్దతిస్తుందని చెప్పాయి. కేంద్రం ప్రకటించిన నిధులతో జాతరలో తాగునీరు, పారిశుధ్యం, వసతి వంటి మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. మేడారం జాతరకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహకారం గిరిజన సంస్కృతి పరిరక్షణకు, జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు తోడ్పడుతుందని స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



