మహిళా రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

మహిళా రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

విశ్వంభర, రామన్నపేట:మార్చి 31న యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో జరిగే రైతు సంఘం మహిళా రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని స్థానిక సిపిఎం కార్యాలయంలో రాష్ట్ర సదస్సు గోడ పత్రికను ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, వ్యవసాయాన్ని విదేశీ స్వదేశీ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే విత్తన బిల్లు, మార్కెట్ ముసాయిదా బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చారని, గతంలో రైతంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఉన్న అవకాశాలను కూడా దూరం చేస్తున్నారన్నారు. పంట నాట్లు వేసినప్పుడే ఇవ్వాల్సిన రైతు భరోసాను పంట కోసే వరకు కూడా రావడం లేదని, వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలకు భూమిపై ఎలాంటి హక్కులు లేకుండా జాయింట్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు పాలకులు వాగ్దానాలు చేస్తున్నారు తప్ప, ఆచరణలో అమలు కావడం లేదని, మరో వైపు పెట్టుబడి సహాయం అందకపోవడంతో మహిళా రైతుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కౌలు రైతుల్లో కూడా మహిళలు గణనీయంగా ఉన్నారని పాలు, పండ్లు, కూరగాయలు, చేపల పెంపకం, కోళ్ల పెంపకంలో వీరి పాత్ర కీలకంగా మారిందని, వీటిలో కూడా మహిళలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి బోయిని ఆనంద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జల్లెల పెంటయ్య, బల్గూరి అంజయ్య, సిఐటియు జిల్లా నాయకులు బొడ్డుపల్లి వెంకటేశం, వేముల సైదులు, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: