చరిత్రలో తొలిసారి.. మేడారంలో తెలంగాణ కేబినెట్

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై రేవంత్ సర్కార్ ఫోకస్

చరిత్రలో తొలిసారి.. మేడారంలో తెలంగాణ కేబినెట్

రాష్ట్ర పరిపాలన చరిత్రలో ఒక అరుదైన, చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సాధారణంగా భాగ్యనగరంలోని సచివాలయానికే పరిమితమయ్యే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. ఈసారి రాజధానికి దూరంగా, కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవం.. మేడారం సమ్మక్క-సారలమ్మ క్షేత్రంలో జరగనుంది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పరిపాలన చరిత్రలో ఒక అరుదైన, చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సాధారణంగా భాగ్యనగరంలోని సచివాలయానికే పరిమితమయ్యే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. ఈసారి రాజధానికి దూరంగా, కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవం.. మేడారం సమ్మక్క-సారలమ్మ క్షేత్రంలో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 18న (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ములుగు జిల్లా మేడారంలోని 'హరిత హోటల్' ఈ కీలక భేటీకి వేదిక కానుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పాలనను ప్రజల వద్దకు, ముఖ్యంగా వెనుకబడిన గిరిజన ప్రాంతాలకు తీసుకెళ్లాలనే సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Read More సైబర్ నేరాలపై అవగాహన సదస్సు 

మేడారం గడ్డపై జరగనున్న ఈ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. త్వరలో జరగనున్న సమ్మక్క-సారలమ్మ మహా జాతర ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించడంతో పాటు నిధుల కేటాయించనున్నారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక చర్చ జరపనున్నారు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన, రైతు భరోసా పథకం అమలు, మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై కేబినెట్ దిశానిర్దేశం చేయనుంది. మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా మంత్రులందరూ హాజరుకానుండటంతో మేడారంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.