ఇందిరమ్మ ఇండ్లు పేదలకు గొప్ప వరం
విశ్వంభర,ఇనుగుర్తి: పేదల ఇంటి కల సాకారం చెందడానికి రాష్ట్రంలోని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరమని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ అన్నారు. మండల కేంద్రం ఇనుగుర్తి లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు పరిపాటి రాంరెడ్డి స్వప్న, రాము తండాలో లావుడియా శ్రీను అనిత ల గృహప్రవేశానికి ఎమ్మెల్యే హాజరై కుటుంబ సభ్యులు,ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులతో కలిసి ఆదివారం గృహప్రవేశ ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి రూ 5లక్షలు చొప్పున ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తుందన్నారు. ఏప్రిల్ లో 2వ,విడత ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపులు జరుగుతాయని,అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇచ్చి తీరుతామన్నారు. పేదలకు కడుపునిండా కూడు, ఉండటానికి గూడు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యే నర్సరీ నీ ప్రారంభించారు.కార్యక్రమంలో సర్పంచులు తమ్మడపల్లి కుమార్, మీటు నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సతీష్, జిల్లా నేత బైరు అశోక్ గౌడ్, వీరన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.



