పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం
విశ్వంభర,సూర్యాపేట: ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా పట్టణ పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు మున్సిపాలిటీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది తెలిపారు.ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికుల కోసం నిర్వహించిన ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా కార్మికులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు.అనంతరం చైర్‌పర్సన్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణలో వారి సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. అందువల్ల వారి ఆరోగ్యం కాపాడటం కూడా మున్సిపాలిటీ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.పారిశుధ్య కార్మికులు రోజువారీ పనుల్లో భద్రతా నియమాలను పాటిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. అవసరమైనప్పుడు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ ప్రజల ఆరోగ్యం కోసం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. వారి ఆరోగ్య రక్షణ కోసం ఇటువంటి వైద్య శిబిరాలను నిర్వహించడం అవసరమన్నారు. భవిష్యత్తులో కూడా కార్మికుల సంక్షేమం కోసం మున్సిపాలిటీ తరఫున మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ఇలాంటి వైద్య శిబిరాలను తరచూ నిర్వహిస్తూ పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తామని, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సిఎచ్. హన్మంతరెడ్డి,వైస్ ఛైర్మెన్ యం. డి. షఫీ ఉల్లా, 40 వ వార్డు కౌన్సిలర్ కొణతం రాజేష్ రెడ్డి, శానిటేరి ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ శివ ప్రసాద్ వైద్య అధికారులు,సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



