వీఆర్ఎల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి
- ఆర్. కృష్ణయ్య
విశ్వంభర, ముషీరాబాదు: వీఆర్ఎల వారసులకు జీవో నెం. 81, 85 ప్రకారం తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాదు ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ, వీఆర్ఎ వారసుల జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో భారీ ధర్నా, నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, వీఆర్ఎ వారసుల జేఏసీ అధ్యక్షుడు ఆంజనేయులు నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జీవో ప్రకారం ఉద్యోగాలు వస్తాయనే ఆశతో 3,797 మంది వీఆర్ఎల వారసులు 15 నెలలుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 456 మంది వీఆర్ఎలు మరణించారని, అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు.వీఆర్ఎల వారసులకు ఉద్యోగాలు కల్పిస్తే రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం 3,797 మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం ఎందుకు ఆలస్యం చేస్తున్నదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో గంగమల్లు, హరీష్, లక్ష్మన్, అనిల్, శ్రీనివాసులు, శ్రీనివాస్, యాదల్, జిల్లపల్లి అంజి, రాజేందర్, శివకుమార్ యాదవ్, రాందేవ్ మోడి తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వీఆర్ఎలు, వారసులు హాజరై ధర్నా అనంతరం నిరసన ర్యాలీ నిర్వహించారు.



