బీజేపీలోకి చేరిక
విశ్వంభర, నాంపల్లి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సమక్షంలో ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు నాయకులు పార్టీలో చేరారు. ప్రముఖ సంఘసేవకుడు, గౌడ సంఘం అధ్యక్షుడు, బీఆర్ఎస్ నాయకుడు పంజాల గిరిధర్ గౌడ్ తమ మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరారు. అలాగే న్యాయవాది కవిత, పృథ్వీరాజ్ తమ అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు పార్టీలో చేరిన వారికి కండువా కప్పి స్వాగతించారు. అనంతరం మాట్లాడుతూ యువకులు, మహిళలు పెద్దఎత్తున బీజేపీలో చేరడం పార్టీపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. ప్రజా సేవ లక్ష్యంగా కలిసి పనిచేయాలని కొత్తగా చేరిన వారికి పిలుపునిచ్చారు. హైదరాబాదు నగరంలో మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై విశ్వాసంతో బడుగు బలహీన వర్గాలు సహా అనేక మంది బీజేపీ వైపు వస్తున్నారని పేర్కొన్నారు. నగర అభివృద్ధి కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతం రావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి, హైదరాబాదు సెంట్రల్ అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్, మాజీ కార్పొరేటర్ అడపా చంద్రమౌళి, జగన్ తదితరులు పాల్గొన్నారు.



