అన్నమాచార్య 523వ ఆరాధన, మహానగర సంకీర్తన

అన్నమాచార్య 523వ ఆరాధన, మహానగర సంకీర్తన

  • విద్యార్థులు అన్నమయ్య ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

విశ్వంభర, ముషీరాబాద్: అన్నమాచార్య భక్తి సంప్రదాయాన్ని యువతకు చేరవేసేందుకు స్కూల్స్, కాలేజీల విద్యార్థులు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకునే అంశాన్ని ముఖ్యమంత్రికి తెలియజేస్తానని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం బహుళ ద్వాదశి సందర్భంగా హైదరాబాదు ట్యాంక్‌బండ్‌పై ఉన్న తాళ్లపాక అన్నమాచార్య విగ్రహం వద్ద నిర్వహించిన అన్నమాచార్య 523వ ఆరాధన, మహానగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ శోభా రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య కీర్తనలను శిష్యులతో కలిసి ఆలపించి భక్తి గీతాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.డాక్టర్ శోభా రాజు మాట్లాడుతూ ప్రపంచ శాంతి, భక్తి భావాలను విస్తరించడమే ఈ ఆరాధన కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గత 45 సంవత్సరాలుగా అన్నమాచార్య కీర్తనలను ప్రజల్లో విస్తరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.పూజ్యశ్రీ ఆదిత్య పరాశి స్వామీజీ మాట్లాడుతూ అన్నమాచార్య కీర్తనలు భక్తి, ఆధ్యాత్మిక విలువలను సమాజానికి అందిస్తున్నాయని తెలిపారు.కార్యక్రమంలో దిగ్గిల శ్రీశేఖర్ బాబు, నందినూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: